Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 51

Satananda tells the story of Viswamitra !!

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః |
హృష్టరోమా మహాతేజాః శతానందో మహతపాః ||

తా|| ధీమతుడైన విశ్వామిత్రుని యొక్క ఆ వచనములను విని మహాతేజోవంతుడు మహా తపోధనుడు( శతానందుడు) పులకితుడయ్యెను

బాలకాండ
ఏబదియొకటవ సర్గము
( శతానందుడు విశ్వామిత్రుని పూర్వ వృత్తాంతము చెప్పుట)

ధీమతుడైన విశ్వామిత్రుని యొక్క ఆ వచనములను విని మహాతేజోవంతుడు మహా తపోధనుడు అగు శతానందుడు పులకితుడయ్యెను. తపశ్శోభలతో వెలుగొందుతున్నఅ గౌతమునియొక్క జ్యేష్ట పుత్రుడు ( శతానందుడు) రామ దర్శనము గురించి విని విస్మయము పొందెను. శతానందుడు సమీపమునే సుఖాసీనిలైన రాజకుమారులను చూచి మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రునితో ఇట్లనెను." హే మునిశార్దూల ! రాజపుత్రుల కోసము దీర్ఘముగా తపమొనరించిన మా అమ్మగారికి వారు దర్శనమిచ్చిరి గదా! యశస్విని అగు మా తల్లి సమస్త ప్రాణులకూ పూజింపతగిన మహాతేజోవంతుడైన రాముని వనములో దొరకు సామాగ్రులతో పూజించెను గదా ! ఓ మహాతేజా ! మా అమ్మగారికి పూర్వము దైవవశాత్తు జరిగిన సంఘటన గురించి రామునకు చెప్పబడినది కదా ! ఓ కౌశికా ! ఓ మునిశ్రేష్ఠా ! మా అమ్మ రామసందర్శనము తరువాత మా తండ్రితో చేరినదికదా ! ఓ కుశికాత్మజ ! మా తండ్రిగారు రాముని పూజించెనుకదా ! పూజలు అందుకున్న మహతేజోవంతుడు మహాత్ముడు అగు శ్రీరాముడు మా తండ్రిని అనుగ్రహించెనా ! ఓ కుశికాత్మజ ! అనుగ్రహించిన రాముడు మాతండ్రిగారిని ప్రశాంతమైన మనస్సుతో అభివాదమొనర్చెనా !

వాక్యజ్ఞుడు వాక్యకోవిదుడూ అయిన శతానందుని యొక్క ఆ వచనములను విని మహాముని విశ్వామిత్రుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. "ఓ మునిశ్రేష్ఠా ! నేను చేశినపని నా కర్తవ్యము". అంతకు మించి ఏమీలేదు . ఏవిధముగా భార్గవుడు రేణుకతో చేరెనో అదే విధముగా గౌతమ ముని తన పత్ని అహల్యతో చెరెను .

ఆవిశ్వామిత్రుని చే చెప్పబడిన ఆ వచనములను విని శతానందుడు మహాతేజోవంతుడైన రామునితో ఇట్లు పలికెను. "ఓ నరశ్రేష్ఠా ! స్వాగతము . ఓ రాఘవా! ఆపరాజితుడైన మహర్షి విశ్వామిత్రుని అనుసరించి భాగ్యఫలము పొందితివి. మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు ఊహించలేని కర్మల తో తపస్సుతో బ్రహ్మర్షి అయినవాడు. ఆయన యొక్క మార్గములను తెలిసుకొన తగును. ఓ రామా ! నీ కన్న ధన్యమైన వాడు ఈ భువిలో లేడు. ఈ కుశికపుత్రుడు మహత్తరమైన తపస్సుచేసినవాడు . నీ రక్షకుడు . అ మహాత్ముడైన కౌశికుని యొక్క బలము జరిగిన వృత్తాంతముగురించి నేను మీకు సమగ్రముగా వినిపించెదను వినుడు".

శతానందుడు చెప్పసాగెను,

"విశ్వామిత్రుడు ధర్మాత్ముడు. శత్రువులను అణిచినవాడు. దీర్ఘకాలము రాజుగా వుండెను. ధర్మజ్ఞుడు. సమస విద్యలను నేర్చినవాడు . ప్రజలహితము కోరువాడు. కుశు డను మహీపతి ప్రజాపతి యొక్క సుతుడు. కుశునియొక్క పుత్రుడు బలవంతుడైన ధార్మికుడైన కుశనాభుడు. కుశనాభునియొక్క సుతుడు గాధి అని వినికిడి. ఆ గాధియొక్క పుత్రుడు మహాతేజోవంతుడైన మాహాముని విశ్వామిత్రుడు. మహాతేజోవంతుడైన విశామిత్రుడు భూమిని పాలించెను. ఆ రాజు వేలకొలదీ సంవత్సరములు రాజ్యమును పరిపాలించెను".

"ఒకసారి ఆ మహా తేజోవంతుడు ఒక అక్షహౌణి బలముతో కలిసి భూమండలము జయించి చుట్టూ తిరిగెను. ఓ రామా అతడు నగరములను, రాష్ట్రములను, నదులనూ అదేవిథముగా పర్వతములను తిరుగుచూ ఒక ఆశ్రమమునకు చేరెను. నానా వృక్షములతో కలిసివున్న అనేక మృగములతో నిండియున్న సిద్దులచే చారణులచే సేవింపబడుచున్న వశిష్ఠాశ్రమపదమునకు చేరెను".

"ఆ ఆశ్రమపదము దేవ దానవ గంధర్వ కిన్నరులచే అది శోభిల్లుచుండెను. ప్రశాంతముగా లేళ్ళ గుంపులతో నిండియుండెను. పక్షులగుంపులతో నిండియుండెను.ఆ అశ్రమపదము బ్రహ్మర్షి గణములతో, దేవర్షి గణములతో సేవింపబడుచుండెను. అచటి ఋషులు తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలె తేజోమూర్తులు. ఆ ఆశ్రమపదము నిరాహార దీక్షలో నున్నవారు, వాయువుమాత్రము భక్షించువారు, పండి రాలిన పత్రములను భక్షించువారు, ఫలములు మూలములను ఆహారము గా గలవారు, దూమ్పలే తినువారు , రోషమును జయించినవారు, ఇంద్రియములను జయించినవారు కలరు. ఆ ఆశ్రమపదము ఋషులు, వాలఖిల్యులు, వైఖానసులు , జపహోమపరాయణులతో శోభిల్లుచుండెను".

"ఆ వశిష్ఠాశ్రమపదము ఇంకొక బ్రహ్మలోకమువలే నుండెను. అట్టి ఆశ్రమమును విజేతలలో శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు దర్శించెను".

||ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో యాభైయొకటవ సర్గ సమాప్తము||

|| ఓమ్ తత్ సత్ ||

వశిష్ఠాశ్రమపదం బ్రహ్మలోకమివాపరం |
దదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహబలః ||

తా|| ఆ వశిష్ఠాశ్రమపదము ఇంకొక బ్రహ్మలోకమువలే నుండెను. అట్టి ఆశ్రమమును విజేతలలో శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు దర్శించెను

 

|| om tat sat ||